భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880 - 1959)

సమకాలీన చరిత్ర - ప్రశ్న సమాధాన రూపం

కిందటి శతాబ్ది భారత దేశ మేధావులలో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకరు. గాంధీజీకి ఆయన అత్యంత విశ్వాసపాత్రుడు. గాంధీజీ సూత్రకారుడైతే దాని భాష్యకారుడు పట్టాభి అంటారు జాతీయోద్యమ చరిత్ర తెలిసినవాళ్ళు. భారతీయ స్వాతంత్రోద్యమ ప్రధాన ఘట్టాలన్నిటా మహాత్మా గాంధీ వెన్నంటి ఉండి ఆయన నిర్మాణ కార్యక్రమాలన్నిటికీ బలమూ ఊపునిచ్చినవాడు పట్టాభి. భారత దేశ ఆర్ధిక వ్యవస్థ ఏ పునాదులపై రచించవలసిందీ జాతీయ దృక్పథంతో ఆయన తన ఎన్నో రచనలలో వివరించారు. కేవలం రెండు నెలల వ్యవధిలో భారత స్వాతంత్ర కాంగ్రెసు చరిత్రను 1600 పుటలలో ఇతరత్ర పుస్తక సహాయం, ఆధార సామగ్రి లేకుండా జ్ఞాపక బలం తోనే రచించాడు పట్టాభి.

ఆయన గొప్ప దేశ భక్తుడు. భారత దేశంలో ఇన్ష్యూరెన్స్, బ్యాంకింగ్, కో-ఆపరేటివ్ రంగాలలో మౌలికమైన ప్రశస్తమైన సంస్థలను నిర్మించిన తొలి తరం వారిలో అగ్రగణ్యుడు. అత్యద్భుత మేధా సంపత్తి, జ్ఞాపక శక్తి కలవాడు. స్వాతంత్ర్యానంతరం భారత కాంగ్రెస్ వర్కింగు కమిటీలో అనేక సంవత్సరాలు సభ్యుడు. ఆంధ్ర రాష్ట్రాన్ని గూర్చి అది ఏర్పడటానికి అర్ధ శతాబ్దానికి ముందే సిద్ధాంత భూమికను నిర్మించినవాడు. భారత దేశంలో ఆనాటి స్వతంత్ర స్థానాలు స్వతంత్ర భారతంలో లీనం కావడానికి, అక్కడి ప్రజల ప్రజాస్వామిక హక్కులు దృఢ పడటానికి గొప్ప కృషి చేసినవాడు పట్టాభి.

ఆయనకొక అద్భుతమైన అలవాటుండేది. ఎక్కడికెళ్ళినా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అది స్కూలు పిల్లల పాఠశాల వార్షికోత్సవం కావచ్చు, కళాశాల విద్యార్థుల సారస్వత సమావేశం కావచ్చు, రాజకీయ సభల అద్యక్ష స్థానం కావచ్చు, పార్టీ సమావేశం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా పత్రికా విలేఖరుల దగ్గరనుంచి పాఠశాల విద్యార్ధివరకూ ఏ సమావేశంలో, ఏ ఉత్సవంలో, ఏ సాంఘిక కార్యకలాపంలో దేశ పరిస్థితులకు, ప్రపంచ వర్తమాన సంఘటనలకు సంబంధించి ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నను, అందుకాయన ఇచ్చిన సమాధానాన్ని, ఆ సమావేశ సందర్భాన్ని ఆయన నమోదు చేసి ఉంచారు. వాటిని 'కరెన్ట్ హిస్టరీ ఇన్ క్వస్చన్స్ అన్డ్ ఆన్సర్స్' అనే పేరుతో భద్ర పరచారు. స్వాతంత్రం రావడానికి ఒక సంవత్సరం ముందుగా కలకత్తాలో ఒక ప్రచురణ సంస్థ ఈ గ్రంథం ప్రచురించింది. ఇందులో సుమారు వెయ్యి ప్రశ్నలకు సమాధానాలు కూర్చారు పట్టాభి. ఈ పుస్తకం ఉందని నేడెవరికీ తెలియదు. తెలుగువారికి అసలు తెలియదు. పత్రికా రచయితలకు, పార్టీల నాయకులకు, ప్రజాసేవారంగ ప్రముఖులకు, ప్రభుత్వ నిర్వాహకులకు, వివిధ పార్టీల సిద్ధాంత వేత్తలకు, ఆర్ధిక సామాజిక విద్యా సాంస్కృతిక రంగ ప్రసిద్ధులకు అంతకుముందే తెలియదు. ఈ ప్రశ్నలు వీటికి సమాధానాలు పట్టాభి ఇంగ్లీషులో రూపొందించారు. ప్రశ్నలడిగిన వారు వాటిని తెలుగులోనో, ఇంగ్లీషులోనో, హిందీలోనో అడిగినా పట్టాభి సమాధానం ఆయా భాషలలోనే చెప్పినా ఆయన వాటిని ఇంగ్లీషులో రాసి భద్ర పరిచారు. ఇది ఒక రకంగా భోగరాజువారి ఆత్మ కథ అని చెప్పాలి. ఆయన పద్నాలుగో ఏట మెట్రికులేషన్, పదహారో ఏట ఎన్.ఏ.పద్దెనిమిదో ఏట బీ.ఏ అయి తరువాత నాలుగేళ్ళు వైద్య విద్యనభ్యసించారు. అధునిక వైద్య విద్య సాధించిన తెలుగువారిలో ఆయన మొదటి తరం వారు. ఈ శతాబ్ది ప్రారంభం నుంచీ ఆయన ప్రజా సేవారంగంలో ఉన్నారు. వైద్య వృత్తిలో గణనీయంగా అర్జించారు. దేశం కోసం ఎంతో త్యాగం చేశారు. పత్రికలు నడిపారు, సంస్థలు స్థాపించారు. జైలుకు వెళ్ళారు. ఎన్నో అసౌకర్యాలు కోరి కోరి వరించారు.

ఈ వెయ్యి ప్రశ్నలు వాటి సమాధానాలు ఆయన అత్మ కథకాక భారత దేశపు స్వాతంత్రోద్యమం, ఆధునిక కాలపు చరిత్ర, సమాజ, సాంస్కృతిక విశేషాలు ఆనాటి ప్రపంచ సంఘటనలు తెలియజేస్తాయి. ఆధునిక భారత దేశ వివిధ ప్రాంతాల సాంఘిక జీవనం, చారిత్రక భౌగోళిక విశేషాలు, గాంధీజీ ఉద్యమం, ఆనాటి వివిధ రంగాల వివిధ వ్యక్తుల స్వరూప స్వభావ, వ్యక్తిత్వాలు తెలుపుతాయి.

ఆధునిక భారత దేశ చరిత్ర, సమాజం, సంస్కృతి, సాహిత్య భాషోద్యమాలలో విశేష ఆసక్తి కలిగి కృషి చేస్తున్న అక్కిరాజు రమాపతి రావు భోగరాజు వారి "కరెన్ట్ హిస్టరీ ఇన్ క్వస్చన్స్ అన్డ్ ఆన్సర్స్" సంపాదించి ముఖ్యంగా తెలుగువారికి తెలపాలనే పూనికతో అందులో కొన్నిటిని అనువదించటం జరిగింది. వీటికి వచ్చే స్పందనను బట్టి తక్కినవి కూడా తెలుపగలననే నమ్మకంతో ఆయన ఉన్నారు.

ప్రశ్న 1: భారతదేశపు రూపురేఖల్ని, సమాజస్వరూపాన్ని మీరు - ఇప్పటినుంచి 5 సంవత్సరాల తర్వాత, 1 ఏళ్ళ తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో రూపుకట్టించగలరా? (స్వాతంత్ర్యం కనుచూపుమేర సన్నివేశం)

సమాధానం: తప్పకుండాను! ఇందులో విశేషమేముంది? ఒక చెట్టు మీద ఆకులిన్ని ఉన్నాయని నేను చెపుతాననుకోండి! కాదనగలరా మీరు? అనలేరు? ఎందుకంటే మీరెట్లా కాదంటారు? ఇందుకు మార్గమేముంది? కాబట్టి నాకు సాధ్యం కాదు! నేను చెప్పలేను అని ఎందుకనాలి? చెపుతాను.

మొదటి అంశం, ఐదేళ్ళలో మన సైనిక బలగంలో అందరూ భారతీయ అధికారులే ఉంటారు. ఉత్తుంగ వినీలసాగర తరంగాలపై భారత నౌకలు త్రివర్ణ పతాక శోభితంగా సాగుతుంటయి. మన రైలు పెట్టెలన్నిటా మూడవ తరగతితో సహా విద్యుత్ పంఖాలు తిరుగుతుంటాయి. పల్లెటూళ్ళ నిండా టెలిఫోన్లు సందడి చేస్తుంటాయి. పల్లె ఇళ్ళలో ఎక్కడ చూసినా రేడియోలు మార్మ్రోగుతుంటాయి.

ఇక రెండవ అంశం. పదేళ్ళ తర్వాత ప్రతి తహసీలు మేరకు ఒక కళాశాల పనిచేస్తుంది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక ఇంజినీరింగ్ కాలేజీ, మానసిక వ్యాధుల చికిత్సా కేంద్రం ఒకటి, కంటి జబ్బుల నిపుణ చికిత్సాలయం ఒకటి, పల్లెటూళ్ళన్నిటికీ పక్కా రోడ్లు, ప్రతి చోటా స్వదేశీ కార్లు పన్నెండు చొప్పున ఉంటాయి. దేశంలో చదువురాని వ్యక్తి ఒక్కరూ ఉండరు. శిశు మరణ రేటు ఇప్పుడున్నదానికి ఆరో వంతు తగ్గిపోతుంది.

ఇక అటు తర్వాత జిజ్ఞాస కదూ! 25 ఏళ్ళ తర్వాత ప్రతి టౌను (నగరంలో) లోను హెలికాప్టర్లుంటాయి. సినిమా నిలయాలేకాక అందరికి టెలివిజన్ సదుపాయాలుంటాయి. ఇప్పుదు స్వంత మోటారు కారు సొఉకర్యం గల వ్యక్తులు కొన్దరున్నట్లు అప్పుడు విమానాల స్వంతదార్లు కూడా పొఉరుల్లో కొన్దరుంటారు. భారతీయ విశ్వవిద్యాలయాలలో చైనా విద్యార్థులు, తూర్పు దేశాల, పడమటి దేశాల విశ్వవిద్యాలయాలలో చదువులలో ఉంటారు. వాణిజ్యం, సంస్క్రుతి పరస్పర ప్రభాశీల పరివర్తితమవుతాయి. మన దేశంలో పరిశోధన సంస్థలు (రీసెర్చి లాబొరేటరీలు) బహుళంగా వ్యవస్థితమవుతాయి. మన దేశం నుంచి అప్పుడు కొత్తగా ఎన్.ఆర్.ఎస్.ఎల్ అనే విశిష్ట గుర్తింపును పొందటానికి ఉత్సుకుతులవుతారు విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఫెలొ అన్ ది రిపబ్లికన్ సొసైటీ అన్ ఇండియా - అని పిలిపించుకోవటానికి ముచ్చట పడతాడు. రాయల్ సొసైటీ అన్ ఇంగ్లండ్ - అనే దాని స్థానంలో మన ఫెల్లొషిప్లు అధికతర గౌరవ ప్రాధాన్యం పొందుతాయి). ఇక 5 ఏళ్ళ తర్వాత మన దేశ స్థితి ఎట్లా ఉంతుందని కదూ మీరడిగారు - అక్కడికి వస్తున్నాను. అబ్బో! అప్పటి ఆ అద్భుత లోకాన్ని నేను ఊహించను కూడ లేకపోతున్నాను. మానవులు రెక్కలు మొలిపించుకొని వినువీధుల్లోకి వెళ్ళవచ్చు. సుప్త దశను సాధించి అట్లానే కొన్నాళ్ళుండిపోవచ్చు. రక్తాన్ని శీతలీకరణం చేయవచ్చు. పిట్యూటరీ గ్రంథిని తమ ఇష్టం వచ్చినట్ట్లు పని చేయించవచ్చు. వైపరీత్య రుగ్మతలను ఎండోక్రీనుల ద్వారాను, విటమిన్ల ద్వారా సరిదిద్ది జీవన యాగం సక్రమంగా, సాఫీగా సాగిపోయేట్లు చేయవచ్చు. భారతీయ విజ్ఞానం జేజేలందుకోవచ్చు.

ప్రశ్న 2: మీ ఉద్దేశ్యంలో భారత దేశం స్వీయ రక్షణలో స్వావలంబనం సాధించగలదా?

సమాధానం: ఇది ఏం ప్రశ్న? ఇందులో ఆవగింజంత సందేహానికైనా ఆస్కారం ఉందా? ఇదే ఇంకొక దేశంలో అయితే ఇటువంటి అంశం ప్రస్తావించినందుకు నీపై తుపాకి గురి పెట్టేవాళ్ళూ. అప్పుదు నీకు స్వ సంరక్షణావశ్యకత అంటే ఏమిటో తెలిసివచ్చేది. మనం - మన భారత దేశం ఇంగ్లండును, ఫ్రాన్సును, దక్షిణ, ఉత్తర, తూర్పు ఆఫ్రికాలను హాంగ్ కాంగ్ ను కాపాడినవాళ్ళము, మనను మనం సంరక్షించుకోలేమా - లేకపోతే మతిభ్రష్టులైనా కావాలి? లేదా ఈ శంకితుడు రిప్ వాన్ వింకిల్ అన్నా కావాలి!

ప్రశ్న 3: ఇప్పుడిక భారత దేశ చిత్రపటాన్ని మీరు ఎట్లా తిరిగి రచిస్తారు?

సమాధానం: అది చాలా సులభం. సరిహద్దు రేఖలను, ఇదివరకటి రంగులనూ మార్పు చేస్తే సరిపోతుంది. భారత దేశపురంగు కాషాయ రంగు కానీ మాన్జిష్టం కానీ మారిస్తే సరిపోతుంది. భ్రితిష్ వారి ఎరుపురంగు అద్రుశ్యమైపోతుంది. సంస్థానాధిపతులకెటువంటీ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే వారి హరిద్రవర్ణం మన మాన్జిష్టానికి దగ్గరగా ఉంటుంది. నవభారతంలో 14 రాష్ట్రాలు, 8 సంపూర్ణ సంస్థానాలు 8 చిన్నపరగణాల సమూహాలు ఉంటాయి. అదీ సర్వసత్తాక స్వతంత్ర గణతంత్ర భారతదేశ స్థానం.

ప్రశ్న 3: శుద్ధ విజ్ఞాన శాస్త్రపరంగా అంటే 'Fundamental Science' విషయికంగా రష్యా వాళ్ళు వెనకబడి ఉన్నారంటారు?! మీ అభిప్రాయం?

సమాధానం: విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణ పురోగతి తొలిదశలలో సోవియట్ రష్యా 'fundamental science' విషయమై ఎక్కువ శ్రద్ధాసక్తులూ, అనుక్వర్తిత విజ్ఞాన శాస్త్రాలు ( అప్లయిడు సైన్సు) విషయమై కొంతవరకు అశ్రద్ధ కనబరచింది. అయితే తర్వాత కాలంలో ఈ విషయంలోనూ బాగా ముందంజ వేసింది. అంతే కాకుండా యుద్ధమనేది ఉన్నదే, అది ఒక దేశపు చేతనా శక్తిని ఒక్కసారిగా ఉధ్రుతం చేస్తుంది. మాంద్యాన్ని ఎంతమాత్రం సహించదు. తన జాతీయ అవసరాలను కాని విద్యారంగ పరిశోధనలలో కాని ఏవో పరిమితులు విధిచుకొని కాలక్శ్హెపం చేయజాలదు. ఆధునిక యుద్ధాలన్నీ సాంకేతిక విజ్ఞానానికి సంబన్ధించినవి. ఏఎ యుద్ధాలు సాగించటంలో 'ఇంజినీరింగు' ప్రజ్ఞ ఎన్తో అవసరం. మరి ఇదంతా అనువర్తిత విజ్ఞానమన్న మాటే కదా! శత్రువు ప్రయోగించే ప్రతి విధ్వంసకాయుధం తిప్పి కొట్టగల మరింత శక్తిమంతమైన ఆయుధం అవసరమవుతుంది ఇరుపక్షాల మధ్య యుద్ధంలో. అందువల్ల విధ్వంసకాయుధాల పోటీ అనివార్యమవుతుంది. ఆ మాటకొస్తే ఎప్పుడో 3500 సంవత్సరాల క్రితం జరిగిన కురుక్షేత్ర భీకర సంగ్రామంలో కౌరవ పాండవులు పరస్పరం ఒకరిని మించి ఒకరు ప్రబలమైన అస్త్ర శస్త్రాలు ప్రయోగించుకున్నారు. ఈ విధంగా ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, చక్రాయుధంలాంటివి ప్రయోగించటం జరిగింది. ఆధునిక కాలంలో యుద్ధ స్వభావంలో మార్పు వచ్చింది. ఇప్పుడు రాత్రుళ్ళు యుద్ధం చేయకూడదనే కట్టడి లేకుండా యుద్ధాలు రాత్రుళ్ళు జరుగుతున్నాయి కాబట్టి కొత్త కొత్త అంజనం సహాయం వంటి యుద్ధ ప్రక్రియలు అమలు లోకి వస్తున్నాయి. చీకట్లో చూడగలగటం, వెలుతురులో అదృశ్యంగా ఉండగలగటం లాంటి ప్రక్రియలవి. కౌటిల్యుని అర్ధ శాస్త్రంలో ఇటువంటి ప్రక్రియలన్ని విపులంగా ప్రసక్తమైనాయి.

ప్రశ్న 4: మీ విధ్యాభ్యాసం నాటి విశేషాలు చెపుతారా?

సమాధానం: నేను చిన్నప్పటినుంచి కూడా ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొంటూ చదువు సాగించాల్సివచ్చింది, అవి బీదరికపు కష్టాలు. ఒకటవ తరగతి చదువునుంచి బి.ఎ. వరకు కానీ ఖర్చు లేకుండా అంటే 'ఫ్రీ స్కాలరు' గానే నేను చదువుకున్నాను. పుస్తకాల కోసం ఒక్క పైసా కూడా వెచ్చించలేదు. స్నేహితులైన నా సహవిద్యార్థుల ఇళ్ళలోనేనా పాఠ్య పుస్తకాలన్ని నేను చదివేవాణ్ణీ. అయితే కళాశాలలో పెద్ద క్లాసులోకి వచ్చేటప్పటికి నాకు ధన రూపేణ కూడా బహుమానాలు వచ్చేవి. అప్పుడు ఆ డబ్బు కొంతవరకు క్లాసు పుస్తకాలకు వినియోగించగలిగాను. ఒక ఆముదం దీపం ఉండేది నాకు. దాని ముందే నేను చదువుకునేవాణ్ణి. రాత్రి 8.30 తర్వాత ఎప్పుడూ నేను మేల్కొని చదవలేదు. అయితే ఎనిమిదిన్నరకే నిద్రపోయేవాణ్ణని నాకెంత మాత్రమూ తెలీకపోయేది. నాకు గడియారం ఉండేది కాదు కదా! మరి ఎట్లా తెలుస్తుంది. అయితే ఒకసారి నా స్నేహితులు కొందరు వచ్చి నన్ను నిద్ర లేపి ఎనిమిదిన్నరకే నిద్ర పోతున్నావేమిటోయి అని అడిగారు. ఇన్త తొందరగానా నిద్రపోయేది? అని ఆశ్చర్యం ప్రకటించారు. నాకు కాలగమనం తెలిసే అవకాశమేదీ మరి! ఉదయం దన్త ధావనం చేసుకునే సమయంలోనూ స్కూలుకు వెళ్ళే దారిలోనూ నేను ఆ రోజు పాఠాలు చింతన చేసుకునేవాణ్ణి. నా ఒంటి మీద 'కమీజు' ఉండేది కాదు. నేను ఫోర్తు ఫారంలోకి వచ్చేదాకా నేను చొక్కా ఎరుగను. అప్పటికి నాకు పదకొండేళ్ళూ. నన్ను చూసి వీధిలో ఉన్నవాళ్ళంతా జాలి పడేవాళ్ళు. చిన్న పిల్లవాడు పాపం చలి కాలంలో ఒంటిపైన చొక్కా లేకుండా వణుకుతూ బడికి వెళుతున్నాడే అని. మొలకు ఒక లంగోటి ఉండేది. పద్దెనిమిదంగుళాల చదరంగాల ఒక రుమాలు (కర్చీఫు) మాత్రం వెంట తీసుకుని వెళ్ళేవాణ్ణి. అంతకు తప్ప ఒంటి మీద మరే ఆఛ్చాదన ఉండేది కాదు. రోజూ స్కూలుకు రాను పోనూ కొన్న మైళ్ళ నడక అదిన్నీ. ఆ రోజులెప్పుడన్నా జ్ఞాపకం వస్తే నాకు దిగ్భ్రమ కలుగుతుంది. నేను కాలేజీ లో చదువుతున్న రోజులలో ఒక English ప్రిన్సిపాల్ అన్యాయంగా నా స్కాలరుషిప్ ఆపివేశారు. ఇది ఎట్లా సంభవించిందంటే ఆ కాలేజీలోనే చదువుతున్న నా సన్నిహిత బంధువుల కుర్రవాడొకరు అటువంటి సదుపాయాన్ని తనకు మాత్రం ఎందుకు కలిగించకూడదు అంటూ ప్రిన్సిపాలుపై ఒత్తిడి తెచ్చారు. అప్పుడా ప్రిన్సిపాల్ నా బంధువైన ఆ విద్యార్థిని సంతృప్తి పరచేందుకు నా స్కాలరుషిప్పును రద్దు చేశాడు. అందువల్ల నేను మూడు రోజుల పాటు కాలేజీకి హాజరు కాలేని పరిస్థితి ఏర్పడింది. నాలుగో రోజు ఆ ప్రిన్సిపాలు గారు తాను చేసినపని లోని అసంబద్ధత తెలిసివచ్చి నా కోసం కబరు పంపారు. ఈ విధంగా మళ్ళీ నా స్కాలరుషిప్ పునరుద్ధరించడం జరిగిందన్న మాట. ఈ విధంగా మళ్ళీ నేను కాలేజీలో న చదువు కొనసాగించే అవకాశం లభించింది. మెట్రిక్యులేషనులో కృతార్థుణ్ణి కావడానికి ముందే నాకు నగదు బహుమానాలు కూడా వచ్చాయి. ఈ డబ్బుతో నేను పాఠ్య పుస్తకాలు కొనుక్కొనే వాణ్ణి. F.A క్లాసు చదివుతుండగానే (అప్పుడా తరగతిని ఆ పేరుతో పిలిచేవారు) బి.ఎ. class చదవడానికి నాకు రెండు స్కాలరుషిప్పులు లభించాయి. నాకే మాత్రం ఇష్టం లేక పోయినా బి.ఎ. పరీక్షతో నా చదువు చాలించాల్సి వచ్చింది. ఫిజిక్సు ఎం.ఎ. చదవటానికి నాకు బి.ఎ. చదువుతుండగానే స్కాలరుషిప్ వచ్చినా కూడా చదువు సాగించే వీలు లేకపోయింది. నేను వైద్య విద్యలో చేరదామని నిశ్చయించుకోవడం అందుకు కారణం.

ప్రశ్న 5: ఆడపిల్లలు, మగపిల్లలు ఏ వయసులో బాగా పెరుగుతారు?

సమాధానం: ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఒక వయసు వచ్చేసరికి హఠాత్తుగా పెరిగిపోతారు. ఇంత త్వరలో ఎట్లా పెరిగారనిపిస్తుంది. ఆరు ఏళ్ళ కిందట నువ్వు చూసిన బాలికలు మరి ఆరు నెలల తర్వాత చూస్తే గుర్తుపట్టలేనంత స్త్రీలుగా మరిపోతారు. ఇంటర్మీడియట్ పరీక్ష రాసేవరకూ నేను చాలా పొట్టిగా ఉండే వాణ్ణి. నా ఇంటర్మీడియట్ పరీక్ష 1897 లో రాశాను నేను. నా అధ్యాపకులు నన్ను అభిమానంతో 'పొట్టి; అని పిలిచేవాళ్ళు. పరీక్షా ఫలితాలు తెలిసి మా స్వగ్రామానికి వెళ్ళి రెండు నెల్లలు గడిపి మళ్ళి వాళ్ళకు కనపడినప్పుడు నీవిప్పుడు 'పొట్టి' వి కాదు అన్నారు వాళ్ళు. నేను ఆ రెండు నెల్లల్లో చాలా పొడుగెదిగాను. నాలుగైదు అంగుళలు ఒక్కసారిగా పెరిగిపోయాను. మగపిల్లలు ఈ విధంగా ఎదుగుతారు.

ప్రశ్న 6: మీరు ధరించే బట్టల అజమాయిషీ ఎవరిది?

సమాధానం: ఇంకెవరు? నా భార్యే నా బట్టల ఎంపిక చేస్తుంది. ఇంత వరకు ఒక్కసారిగా కూడా నా బట్టలు నేను ఎంపిక చెయ్యలేదు. అవిధొవతులేకాని, చొక్కాలేకాని, 'కోటే కాని. అది నా వ్యవహారం కాదు. ఇంటి ఇల్లాలు కనక వాళ్ళాయన హున్దాగా, దర్జాగా, ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటే ఆయన ధరించే ఉడుపుల భాద్యత అన్తా విధిగా ఆమె తీసుకోవాల్సిందే. బట్ట ఎంపిక చేయటం దగ్గర నుంచి రూపురేఖల నిర్ణయం చేసి కుట్టుపని పురమాయింపువరకు ఆమెదే బాధ్యత అయినప్పుడు మనకికమరి ఏ పూచీ ఉండదు. ఆ బాదరబన్దీ అంతా మనకెందుకు చెప్పండీ? ఒక మాట చెబుతాను. మీరు కొత్త వోటు వేసుకున్తే ఎలా ఉంటారో అది ఎంతగా నప్పుతుందో ఎంత ఒప్పిదంగా ఉంటారో మీకెట్లా తెలుస్తుంది? మీకంటే మీ ఇల్లాలికి చక్కగా తెలుస్తుంది. ఇందుకొకసామ్యం చెపుతాను. ఆమె వజ్రాలు దుద్దులుపెట్టుకున్నప్పుడు ఆమెకేవి ఎన్త బాగా నప్పుతాయో మీకు తెలిసినన్తగా ఆమెకు తెలియదు కదా! కాబట్టి ఆవిడ వజ్రాల దుద్దుల ఎమ్పిక మీది? మీ ఉడుపుల బాగోగుల బాధ్యత ఇల్లాలిది.

ప్రశ్న 7: మీ సంపాదన జమా ఖర్చులెవరు చూస్తారు?

సమాధానం: ఇంకెవరు? ఆ వ్యవహారమంతా మా ఆవిడే చూసుకుంటుంది. గడచిన 35 సంవత్సరాలనుంచీ నేనే నాడూ డబ్బు జోలికి పోలేదు. అయితే ప్రయాణాలు చేస్తున్నపుడు, టూర్ల మీద ఉన్నప్పుడు తప్పదనుకోండి. అప్పుడిక పర్సుని బయటకు తీయడం, పోర్టరుకు డబ్బులివ్వడం నాకొక పెద్ద బెడద అని నాకనిపిస్తుంది. జీవితంలో కల్లా ఘోరమైన శిక్ష ఏమంటే మన డబ్బుతో మనం వ్యవహరించడం. ఒక వేళ ఆ వ్యక్తి పచ్చి లోభి అయితే ఏమో కాని అంటే తళ తళ లాడే బిళ్ళను లేదా ఖరీదైన నోటును తన సొంత చేతులతో తృప్తి దీరా చూసుకుంటూ ఖర్చు చేదామనుకునే తత్వం ఉన్నవాళ్ళకు తప్ప ఇతరులకు బాధాకరమే.

ప్రశ్న 8: మీ పొలాల సంగతి ఎవరు చూస్తారు?

సమాధానం: నిజం చెప్పాలంటే నా కౌలుదార్లు, పేరుకు మాత్రం మా పిల్లలు,. నాకు నా పొలాల విషయంలో ఎటువంటి ఆసక్తే లేదు. నేను నిత్య సంచారిని. ఖాన్ బాద్షాను (పర్యాటక చక్రవర్తిని) సంచారజారులకు ఇళ్ళుండవు. వాళ్ళ భుజాల మీదనే వాళ్ళ ఆ వాసరి ఉంటుంది. నీవు సంపాదించే ఆస్తి ఏదైనా ఉంటే అది నీ కోసం కాదు. నీ కుటుంబం కోసం, సంతానం కోసం. ఆ కుటుంబం దాని పట్ల శ్రద్ధ చూపితే అది ఉంటుంది. లేకపోతే పోతుంది.

ప్రశ్న 9: మీ ప్రజా సేవా రంగంలో మీకు ఇష్టమైన కార్యక్రమాలేవి? అవంటే మీకు ఎందుకిష్టం?

సమాధానం: నాకు చాలా రంగాలలో ఆసక్తి ఉంది. అయితే ముఖ్యంగా పారిశుధ్యం, సహకార రంగం, విద్యా రంగాలలో చాలా ఆసక్తి అని చెప్పాలి. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ సోయగాలు నన్ను ఎక్కువగా అకట్టుకొన్నాయి. పారిశుధ్యం లేదా ప్రజారోగ్యం నా ప్రధాన వృత్తి ధర్మంగా పాటించాను. అయితే విద్యా రంగాన్ని నాప్రజా సేవారంగంలో ప్రథమ లక్ష్యంగా ఎందుకు ఎంచుకున్నానంటే విద్యార్జనలో ఉండే సాధక బాధకాలు నాకు చిన్నప్పటినుంచి బాగా తెలుసు. నేను నా చదువంతా ఇతరుల దానధర్మాల మీదా, సహాయ సహకారాల ద్వారా సాగించగలిగాను. కాబట్టి నా ఋణం కొంత వరకైనా తీర్చుకోవడం నా ప్రథమ కర్తవ్యంగా భవించాను. ఇతరుల చదువు సంధ్యల్లో సాయపడాలనుకున్నాను. అంతే కాకుండా జాతీయ ప్రయోజనాలకనుగుణంగా విద్యా రంగాన్ని పునర్నిర్మించాలని నేను ఆశించాను. మన జాతి అవసరాలకు తగినట్లుగా ఉండాలి, మన విద్య సామ్రాజ్యవాద రాజ్య ప్రయోజనాల కోసం కాదు. ఈ ఆలోచనతో ఉండగా సహకార రంగం వృద్ధి పొందించడం నేటి అత్యంతావశ్యకం అనిపించింది. భవిష్యత్తు అంతా సహకార రంగానిదే అని గ్రహించాను. ఇక 1915 సంవత్సరం నుంచి బాతుకి నీళ్ళలో ఉండటం ఎంత సహజమో సహకార రంగకృషిలో నేనంతగా నిమగ్నమైనాను.

ప్రశ్న 10: మీరు విద్యా రంగంలో చేసిన కృషి ఏమిటి? సమాధానం: మొట్ట మొదటిగా నేను చేసిన పని ఏమిటంటే 1907 లో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపనకు పూనుకోవడం. 1906 లో జరిగిన కలకత్తా కాంగ్రెసు సమావేశంలో ఆమోదించిన జాతీయ విద్యా తీర్మానానానికి అనుగుణంగా, విధేయంగా ఈ పని చేపట్టాము. ఈ సమావేశానికి దాదాభాయి నౌరోజీ అధ్యక్షులు, వాస్తవానికి ఆంధ్ర జాతీయ కళాశాల సంస్థాపకులు స్వర్గీయ కోపల్లె హనుమన్త రావు గారనే చెప్పాలి. ఆయన ప్రజాహిత జీవన కార్యక్రమం ఎలా ప్రారంభమైందని అనుకున్నారు? సూరత్ కాంగ్రెసు సమావేశానికి హాజరై వచ్చిన తర్వాత ఆయన తన విద్యర్హత పట్టాను చించి వేశారు. 1922 ఫిబ్రవరి దాకా నేను ఆయనకు కార్యదర్శిగా పని చేశాను. ఆ సంవత్సరం ఆయన చనిపోయారు. ఇక నేను ఒంటి చేతివాణ్ణైపోయను.